: జర్మనీ ఛాన్సెలర్ తో కంపు కంపుగా ట్రంప్ సమావేశం!
జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తో అమెరికా అధ్యక్షుడి సమావేశం గందరగోళంగా ప్రారంభమై, గందరగోళంగానే ముగిసింది. ఆమె వైట్ హౌస్ కు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్... ఓవల్ కార్యాలయంలో సమావేశం సందర్భంగా మాత్రం ఆమెకు చుక్కలు చూపించారు. ట్రంప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు మెర్కెల్ పలుమార్లు దగ్గరదగ్గరికి వంగినా ట్రంప్ మాత్రం స్పందించలేదు. సోఫాలో నిటారుగా కూర్చుని, రెండు చేతులు కాళ్లపై ఉంచుకుని, కిందకు చూస్తూ కూర్చున్నారు.
మీడియా ప్రతినిధులు అడిగినా ఆమెకు ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో, ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. అయితే, సమావేశం ముగిశాక మాత్రం ఆమెకు ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ దేశాధినేతతో తొలి సమావేశంలోనే ట్రంప్ ఇలా ప్రవర్తించడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు.
ఈ సమావేశంలో వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, వైర్ ట్యాపింగ్, రష్యా తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను దాచిపెట్టేందుకు దేశాధినేతలిద్దరూ చాలా కష్టపడ్డారు.