కోర్టు హాలులో.. అరుణ్ జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసిన రామ్ జెఠ్మలానీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోర్టు హాలులో.. అరుణ్ జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసిన రామ్ జెఠ్మలానీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలాని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఢిల్లీ హైకోర్టులోని ఓపెన్ హాలులో ఈ ఎగ్జామినేషన్ కొనసాగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై జైట్లీ పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా మీ పరువుకు కేజ్రీవాల్ ఏ విధంగా భంగం కలిగించారో వివరించాలంటూ జైట్లీని జెఠ్మలాని కోరారు. దీనికి సమాధానంగా, తనపై అసత్య ఆరోపణలు చేశారని... తన ప్రతిష్టకు భంగం కలిగించారని... నిరాధార ఆరోపణలతో తనను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేశారని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో, పార్లమెంటు ఎదుట, మీడియాలో నోటికొచ్చినట్టు తనపై విమర్శలు గుప్పించారని తెలిపారు. తనకు జరిగిన నష్టాన్ని డబ్బుతో కొలవలేమని ఆయన అన్నారు.

అనంతరం... కేజ్రీవాల్ ఆరోపణలతో జైట్లీ ఆర్థికంగా నష్టపోలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా రామ్ జెఠ్మలాని కోర్టు దృష్టికి తెచ్చారు. ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా జైట్లీ ఉన్నప్పుడు... ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారంటూ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు.

More Telugu News