Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరాట్ కోహ్లీ తీరు అత్యంత దారుణం.. ప్రవర్తన బాగోలేదు!: ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ హేలీ

క్రికెట్లో స్లెడ్జింగ్ అనేది ఒక భాగమే అయినప్పటికీ... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా దారుణంగా ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ మండిపడ్డాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్న ఆటగాడిని పట్టుకుని 'టాయ్ లెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం... ఓ ఆటగాడిని అగౌరవపరచడమేనని విమర్శించాడు. వాస్తవానికి ఆటలో కోహ్లీ దూకుడంటే తనకు ఎంతో ఇష్టమని... కోహ్లీ తరహా ఆటను తాను ఎన్నడూ చూడలేదనే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పానని... కానీ, ఇలాంటి తీరుతో కోహ్లీపై గౌరవం తగ్గిపోతుందని హేలీ చెప్పాడు. తమ దేశ ఆటగాళ్లను కించపరచడం కోహ్లీకి తగదని అన్నాడు. టీమిండియాకు కెప్టెన్ కాకముందు కోహ్లీ వ్యవహారశైలి ఎంతో బాగుండేదని... ఇప్పుడు ఒత్తిడికి లోనవుతున్న అతను, బ్యాలెన్స్ కోల్పోతున్నట్టు కనపడుతోందని చెప్పాడు.

తొలి టెస్టులో ఆసీస్ బ్యాట్స్ మెన్ రెన్షా టాయిలెట్ కోసం బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్ గురించి నిన్నటి ఆటలో రెన్షా గురించి కోహ్లీ స్లెడ్జ్ చేశాడు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరును కూడా హేలీ తప్పుబట్టాడు. కోహ్లీ స్లెడ్జింగ్ ను పక్కన పెట్టాలని... తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శిస్తే బాగుంటుందని సూచించాడు. 

More Telugu News