: వన్డేను తలపించిన టెస్టు మ్యాచ్... 210 బంతుల్లో డబుల్ సెంచరీ బాదేసిన శ్రేయాస్
కుర్రాడు శ్రేయాస్ అయ్యర్ ధాటికి దిగ్గజాలైన ఆస్ట్రేలియా బౌలర్లు చేష్టలుడిగి పోయారు. టెస్టు మ్యాచ్ కాస్తా వన్డే మ్యాచ్ గా మారిపోయింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ - ఎ ఆటగాడు శ్రేయాస్, కంగారూలను కంగారు పెడుతూ, కేవలం 210 బంతుల్లో 27 ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 202 పరుగులు చేయడంతో ఈ మూడు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆస్ట్రేలియా స్పిన్నర్లు లియాన్, ఒకీఫెలు కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేదు. మరో ఆటగాడు గౌతమ్ 74 పరుగులతో తోడుగా నిలవడంతో భారత స్కోరు పరుగులెత్తింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469/7కు డిక్లేర్ చేయగా, శ్రేయాస్ రాణించడంతో భారత్ 403 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసిన తరుణంలో మ్యాచ్ సమయం ముగియడంతో, అంపైర్లు ఆటను డ్రాగా ప్రకటించారు.