: హోదా విషయంపై మోదీ, చంద్రబాబులతో పవన్ కల్యాణ్ మాట్లాడాలి: ఏపీలో టీఆర్ఎస్ ఎంపీ కవిత
అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమంపై స్పందించారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీలతో కలిసి పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మోదీ, చంద్రబాబులతో పవన్ కల్యాణ్ మాట్లాడాలని ఆమె సూచించారు. అప్పుడే హోదాకు మార్గం సుగమమవుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను గౌరవించాలని కవిత అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని పవన్ అడగాలని ఆమె చెప్పారు. ఎన్నికల ముందు ఓ మాట చెప్పి ఇప్పుడు ఓ మాట చెబితే ప్రజలు అయోమయానికి గురవుతారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడం అనేది మంచిదని ఆమె పేర్కొన్నారు. ఏపీకి హోదా ఇస్తామంటే తాము వద్దని చెప్పబోము కదా? అని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ హైకోర్టు విభజన వంటి పలు సమస్యలు ఉన్నాయని ఆమె అన్నారు.