నిన్న జరిగిన పరిణామాలతో ప్రతిపక్ష పార్టీ నేతల చెడు లక్షణాలన్నీ బయటపడ్డాయి: మంత్రి దేవినేని ఉమా
నిన్న విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ నేతల చెడు లక్షణాలన్నీ బయట పడ్డాయని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు రావడానికి తానే కారణమని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరినయినా ఒకేసారి మోసం చేయగలరని, పదే పదే మోసం చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. నైతిక విలువలు లేని వారు నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో తప్పులు చేసిందని, ఏపీకి అన్యాయం జరిగేలా వ్యవహరించిందని ఆయన అన్నారు. పోలవరానికి అడ్డువచ్చే తెలంగాణలో ఉన్న 7 ముఖ్య మండలాలను కూడా కాంగ్రెస్ ఏపీకి ఇవ్వలేకపోయిందని చెప్పారు.