Chandrababu Naidu: ఏపీ పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం... రేపు అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన

Chandrababu Naidu Launches Major Steel Plant Project in AP
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర ఉక్కు రంగంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ పెట్టుబడికి మార్గం సుగమం అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) ఇండియా, రాష్ట్రంలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ పరిశ్రమకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు. పూర్తయిన తర్వాత ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్లాంట్‌కు అనుబంధంగా రూ.11,198 కోట్ల వ్యయంతో ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల అదనంగా మరో 6 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ ఎకనమిక్ రీజియన్ ఒక ప్రధాన పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందనుండగా, జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ముఖ్యంగా, ప్లాంట్ నుంచి జాతీయ రహదారి-16కు అనుసంధానం చేసేందుకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులను శరవేగంగా చేపట్టింది. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇది స్పష్టం చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి.

సోమవారం జరిగే ఈ చారిత్రక శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం నేరుగా రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 గంటలకు ప్లాంట్‌కు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సందర్శించి, ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్‌ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4:50 గంటలకు జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధులు హాజరవుతున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Arcelor Mittal Nippon Steel
AMNS India
Andhra Pradesh Industries
Steel Plant
Visakha Economic Region
Lakshmi Mittal
Anakapalli District
Industrial Development

More Telugu News