Rama Shankar Naik: అక్రమ ఫిషింగ్ బోట్లతో వేటను ఆపేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP Govt urges Tamil Nadu to stop illegal fishing boats
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు అక్రమంగా ప్రవేశించి వేట సాగించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపింది. తమిళనాడు బోట్ల చొరబాట్లను నివారించేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ మేరకు ఏపీ ఫిషరీస్ కమిషనర్ రామ శంకర్ నాయక్, తమిళనాడు ఫిషరీస్ అండ్ ఫిషర్‌మెన్ వెల్ఫేర్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశం యథేచ్ఛగా కొనసాగుతోందని, దీనివల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. ఈ చొరబాట్లు శాంతిభద్రతల సమస్యలకు కూడా దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మార్చి 18న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఓ సంఘటనను ఆయన తమిళనాడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో ఉన్న నాలుగు ఫిషింగ్ బోట్లను పుదుచ్చేరికి చెందిన మత్స్యకారులు బలవంతంగా తీసుకెళ్లారని తెలిపారు. ఈ ఘటన కారణంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 162 మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. ఇదే సమస్యపై 2022, 2023, 2025 సంవత్సరాల్లో కూడా లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

తమిళనాడు బోట్లు ఏపీ జలాల్లో ట్రాలింగ్ వంటి విధ్వంసకర పద్ధతుల్లో వేట సాగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రామ శంకర్ నాయక్ తెలిపారు. దీనివల్ల తాబేళ్లు, ఇతర అంతరించిపోతున్న సముద్ర జీవుల మరణాలు పెరిగి, వాటి కళేబరాలు ఏపీ తీరానికి కొట్టుకొస్తున్నాయని లేఖలో వివరించారు.
Go Back to Shorts
Rama Shankar Naik
Andhra Pradesh fisheries
Tamil Nadu fishing boats
illegal fishing
fishermen welfare
marine life
fishing harbor
Nellore district
AP government
fisheries commissioner

More Telugu News