Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంత దారుణమా?.. ఏడుపొస్తోంది: నటుడు నారాయణమూర్తి

తన 30 ఏళ్ల సినిమా కెరియర్లో తొలిసారి సంక్రాంతికి తన సినిమాను విడుదల చేస్తున్నానని... విడుదలకు అన్ని సన్నాహకాలు చేసుకున్న తర్వాత, థియేటర్లు దొరకడం లేదని దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లు దక్కకపోవడంతో ఏడుపొస్తోందని చెప్పారు. తామేమీ వందల థియేటర్లు అడగడం లేదని... నాలుగు థియేటర్లు ఉన్న ఊర్లో ఒక థియేటర్ మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నామని అన్నారు.

తమ సినిమా విడుదలకు ప్రభుత్వం, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి సహకరించాలని కోరారు. కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని.. పండుగలు లేనప్పుడు, పెద్ద సినిమాలు లేనప్పుడే చిన్న సినిమాలను విడుదల చేసుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాలు విడుదల అయితేనే పరిశ్రమ బాగుంటుందని చెప్పారు. 'మెగాస్టార్, యువరత్నల సినిమాల మధ్య పీపుల్ స్టార్ సినిమా' అంటూ జనాలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారని... వారిద్దతో తనకు పోటీ లేదని తెలిపారు. కాగా, నారాయణమూర్తి నటించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా ఈ నెల 14న రీలీజ్ కానుంది. ఈ చిత్రంలో జయసుధ కథానాయికగా నటించారు.

More Telugu News