వేధింపులకు దిగడం చాలా బాధాకరం.. వారిని వెంటనే అరెస్టు చెయ్యాలి: బెంగళూరు ఘటనపై ఆమిర్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేధింపులకు దిగడం చాలా బాధాకరం.. వారిని వెంటనే అరెస్టు చెయ్యాలి: బెంగళూరు ఘటనపై ఆమిర్ ఖాన్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులో కొందరు యువకులు నడిరోడ్డుపై యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమ‌ని ఆమీర్‌ఖాన్ అన్నారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే అది మనందరికీ అవమానకరమ‌ని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర స‌ర్కారు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై కఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. యువ‌తుల‌పై ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఏమీ జరగదులే అని ఈ కాలపు యువత భావిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన వెంట‌నే నిందితులను అదుపులోకి తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. వెంటనే అరెస్ట్‌ చేస్తుంటేనే ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉంటాయ‌ని, ఆడపిల్లలవైపు కన్నెత్తి చూడడానికి కూడా వారు భయపడతారని పేర్కొన్నారు.

ప్రముఖ స్క్రిప్ట్‌ రైటర్‌, సల్మాన్‌ తండ్రి సలీం ఖాన్ ఈ ఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తూ... యువ‌కులు పాల్ప‌డిన ఈ ఘ‌ట‌న‌ సిగ్గుపడాల్సిన విషయమ‌ని అన్నారు. తాము కూడా ఆ వయసు దాటి వచ్చినవారమే కానీ, ఇటువంటి దారుణ‌ ఘటనలు ఎన్న‌డూ జరగలేదని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. వీరితో పాటు ప‌లువురు బాలీవుడ్ న‌టులు కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించి కామాంధుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.
amir khan

More Telugu News