: ఆఖరి ప్రయత్నం... తండ్రీ కొడుకులను కలిపేందుకు కదిలిన ఆజంఖాన్!
ఉత్తరప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రి ఆజంఖాన్ ఆఖరి ప్రయత్నం ప్రారంభించారు. ఈ ఉదయం అఖిలేష్ యాదవ్ ఇంటికి వచ్చి, ఆయనతో చర్చలు జరిపారు. తండ్రితో విభేదాలు వద్దని అఖిలేష్ కు సూచించారు. విడిపోతే పార్టీకి, రాష్ట్రానికి నష్టమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై ములాయం తోనూ ఆయన మాట్లాడుతారని తెలుస్తోంది. పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి తేవద్దని, విపక్షాలకు అవకాశం ఇవ్వద్దని కోరనున్నట్టు సమాచారం.
కాగా, నిన్న ములాయం స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు సైకిల్ చిహ్నాన్ని తమకే అప్పగించాలని అటు ములాయం, ఇటు అఖిలేష్ పట్టుమీద ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈసీ కల్పించుకుంటే, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయించకుండా హోల్డ్ చేసే అవకాశాలే అధికంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.