ప్లీజ్.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగొద్దు: విలేకరులతో అళగిరి
తాను రాజకీయాలకు దూరమై చాలా కాలమైందని, వాటికి సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి అన్నారు. చెన్నై విమానాశ్రయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన తండ్రి ఇటీవల అనారోగ్యం పాలవడంతో తరచుగా వచ్చి చూసివెళుతున్నానని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని చెప్పారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించేందుకు విలేకరులు సిద్ధమవుతన్న తరుణంలో.. ‘ప్లీజ్..రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగొద్దు.. నేను రాజకీయల్లో లేను’ అని అళగిరి అన్నారు. కాగా, డీఎంకే పార్టీకి దూరమైన ఆయన్ని, మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, ఒక కీలక పదవిని కూడా ఆయనకు కట్టబెడతారని అళగిరి మద్దతుదారులు అంటున్నారు.