: ఆజాద్ కు శివసేన మద్దతు... క్షమాపణలు చెబితే నిజం కాకుండా పోతుందా?: సామ్నా ప్రశ్న
రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మిత్రపక్షం శివసేన మద్దతు తెలిపింది. యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా సంభవించిన మృతుల కంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని చేసిన వ్యాఖ్యలపై... ఆజాద్ క్షమాపణలు చెబితే నిజం కాకుండా పోతుందా? అని శివసేన పత్రిక సామ్నా ప్రశ్నించింది. యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది అమరులు కాగా, నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో ఇప్పటివరకు 40 మంది తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ రెండు సంఘటనల్లో దాడి చేసినవారు మాత్రమే వేరుగా ఉన్నారని, యూరీపై పాక్ దాడి చేస్తే, ప్రజలపై నోట్ల రద్దుతో ప్రభుత్వ నిబంధనలు దాడి చేశాయని సామ్నా అభిప్రాయపడింది. తాజా నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ కారణాల వల్ల మృతుల సంఖ్య 40 నుంచి 40 లక్షలకు చేరుకుంటే అప్పుడు కేంద్రం వారందర్నీ దేశభక్తులని చెబుతుందా? అని సామ్నా నిలదీసింది.