: జియో జోరుకు బ్రేక్.. నెమ్మదించిన సబ్‌స్క్రైబర్ల వృద్ధి.. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక
వచ్చీరావడంతోనే సంచలనాలకు తెరతీసిన రిలయన్స్ జియో జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆశించిన మేర సేవలు లేకపోవడంతో యూజర్లు పెదవి విరుస్తున్నారు. దీంతో 2018 డిసెంబరు నాటికి పదికోట్ల మంది వినియోగదారులను చేర్చుకోవాలన్న సంస్థ లక్ష్యం దూరమయ్యేలా కనిపిస్తోందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది. జియో సేవలు ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా సేవల్లో ఇంకా నాణ్యత పెరగలేదని, ఇప్పటికీ డేటాను 2.35 స్పీడుతో అందించలేకపోతోందని ఓస్వాల్ తన నివేదికలో విమర్శించింది. ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని పేర్కొంది. నెట్‌వర్క్ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలిపింది. అయితే ఉచిత ఆఫర్ పూర్తి అయి సేవలకు చార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తే జియో అసలు సత్తా ఏంటనేది బయటపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఫ్రీ ఆఫర్ ముగిశాక ఇప్పుడు మొదటి సిమ్‌గా ఉన్న జియోను రెండో సిమ్‌గా మార్చేస్తారని అంచనా వేసింది. చాలామంది సబ్‌స్క్రైబర్లు ఆఫర్ ముగిశాక సిమ్‌ను మూలనపడేయడం ఖాయమని అభిప్రాయపడింది. నెట్‌వర్క్, డేటా సేవల విషయంలో జియోకు ఎయిర్‌టెల్ ప్రధాన పోటీదారు కాగలదని మోతీలాల్ ఓస్వాల్ వివరించింది. మరోవైపు యూజర్ల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి జియో మున్ముందు మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పెట్టుబడులు రూ.2.25 నుంచి రూ. 2.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ప్రస్తుతం అందిస్తున్న వెల్‌కమ్ ఆఫర్‌ను జియో పొడిగించే అవకాశం ఉందని వివరించింది.