విశాఖలో 10శాతమైనా ఇనుప ఖనిజం ఉందా?: కేటీఆర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వ్యాఖ్యలు దురహంకారంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. బయ్యారం గనులను విశాఖ స్టీల్ కు కేటాయించడంపై టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడబోనని, గనుల కేటాయింపులను రద్దు చేసే ప్రశ్నేలేదని నిన్న ముఖ్యమంత్రి కిరణ్ మెదక్ సభలో ఘాటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపైనే తారకరామారావు మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంపై మాట్లాడే శక్తి ముఖ్యమంత్రికి లేదన్నారు. ఖనిజం ఉన్నచోటే పరిశ్రమ పెట్టాలన్నది తమ డిమాండ్ అని చెప్పారు. బయ్యారంలో ఉన్న ఖనిజంలో విశాఖలో 10 శాతమైనా ఉందా? అని ప్రశ్నించారు. లోగడ రక్షణ స్టీల్ కేటాయింపులను కూడా టీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.