Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూనియర్ ఎన్టీఆర్ కు 'నో' చెప్పిన సురేందర్ రెడ్డి!

అల్లు అర్జున్, రవితేజలాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం నో చెప్పాడట. వివరాల్లోకి వెళ్తే, చాలా రోజులుగా ఓ మంచి కథ, మంచి డైరెక్టర్ కోసం వెతుకుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు సురేందర్ రెడ్డితో కలసి పనిచేయాలని అనిపించిందట. దీంతో, తనతో సినిమా చేయమని సురేందర్ ను అడిగాడట. వాస్తవానికి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తానంటే... ఏ దర్శకుడు కూడా వద్దనడు. కానీ, సురేందర్ రెడ్డి మాత్రం నో చెప్పాడట. జూనియర్ కు సురేందర్ నో చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉందట. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ సినీ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతని తొలి చిత్రం 'జాగ్వార్' రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా ఊహించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో... రెండో సినిమాపై నిఖిల్ దృష్టి సారించాడు. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఏకంగా రూ. 13 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ చిత్ర నిర్మాతలు బంపర్ ఆఫర్ ప్రకటించారట. దీంతో, ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పాశాడు సురేందర్. ప్రస్తుతం, రాంచరణ్ నటిస్తున్న 'ధృవ' సినిమాతో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి... 2017 ప్రారంభంలో నిఖిల్ గౌడ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఈ కారణంగానే ఎన్టీఆర్ సినిమాను సురేందర్ రెడ్డి వదులుకున్నాడని ఫిలింనగర్ టాక్.

More Telugu News