'హిందుస్థాన్ కు సలాం' చెప్పిన పాక్ నయా హాట్ స్టార్ అర్షద్ ఖాన్!
పాకిస్థాన్ లో చాయ్ వాలాగా కాలం గడుపుకుంటూ, రాత్రికి రాత్రే స్టార్ అయిపోయి, ఎన్నో మోడలింగ్ అవకాశాలు తెచ్చుకుంటున్న సరికొత్త హాట్ స్టార్ అర్షద్ ఖాన్ కు ఇండియా నుంచి ఓ కంపెనీ, మోడలింగ్ ఆఫర్ ఇవ్వగా, తొలిసారిగా భారత్ నుంచి ఓ ఫోన్ కాల్ స్వీకరించిన అర్షద్, 'హిందుస్థాన్ కు సలాం' చెబుతూ, తనకు అవకాశం లభిస్తే, ఇండియాలో పనిచేస్తానని ఆనందంగా చెప్పాడు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఇంగ్లీషులో మాట్లాడేలా, మరింత యాక్టివ్ గా ఉండేలా శిక్షణ పొందుతున్న అర్షాద్ కు ఇటీవల రాత్రి 9 గంటల సమయంలో ఇండియా నుంచి ఫోన్ వెళ్లింది. అర్షద్ నిద్రపోతుండటంతో, ఆయన బంధువైన రిజ్వాన్ కజ్మీ ఈ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవకాశాలు దగ్గరైనప్పటి నుంచి సరిగ్గా విశ్రాంతి తీసుకోలేకపోతున్నాడని, లేవగానే ఇండియా నుంచి ఫోన్ వచ్చినట్టు చెబుతానని అన్నాడట.
ఆపై అరగంటకే నిద్రలేచిన అర్షద్, భారత్ ఫోన్ కాల్ గురించి తెలుసుకుని అదే నంబరుకు కాల్ చేసి మాట్లాడాడట. ఇండియన్ కంపెనీ ఆఫర్ విని ఉబ్బితబ్బిబ్బయి, తనకు ఇండియాలో పనిచేయడం ఎంతో ఇష్టమని, అయితే, పాక్ నటులకు ప్రస్తుతం భారత్ లో అవకాశాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పాడట. అవకాశం లభిస్తే మీ సంస్థ కోసం పనిచేస్తానని వెల్లడించాడట.