Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్టోబర్ ఎఫ్అండ్ఓ ముగింపు రోజున నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్

అక్టోబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగింపు రోజున మధ్యాహ్నం తరువాత కొనుగోలు మద్దతు వెల్లువెత్తడం, ట్రేడర్లు తాజా పొజిషన్లు తీసుకోవడంతో బెంచ్ మార్క్ సూచికలు నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకెళ్లాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లోకి జారిన సూచికలు, మధ్యాహ్నానికి నష్టాన్ని మరింతగా పెంచుకున్నాయి. ఆపై అన్ని సెక్టార్లలోని కంపెనీల ఈక్విటీలనూ సొంతం చేసుకునేందుకు ఎఫ్ఐఐలు ఉత్సాహాన్ని చూపడంతో స్వల్ప లాభాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా కంపెనీలు మాత్రం నూతన కొనుగోళ్లను రాబట్టుకోవడంతో విఫలమయ్యాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 79.39 పాయింట్లు పెరిగి 0.29 శాతం లాభంతో 27,915.90 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా క్రితం ముగింపు 8,615.25 పాయింట్ల వద్దనే ముగియడం గమనార్హం. బీఎస్ఈ మిడ్ కాప్ 1.14 శాతం, స్మాల్ కాప్ 0.77 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 16 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో కార్ప్, యస్ బ్యాంక్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,926 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,061 కంపెనీలు లాభాలను, 1,604 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,12,98,312 కోట్లుగా నమోదైంది.

More Telugu News