Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధర్మవరంలో ఉద్రిక్తత... పరిటాల సునీత వర్సెస్ వరదాపురం సూరి

అనంతపురం టీడీపీ నేతల మధ్య విభేదాలు అంతకంతకూ ముదురుతున్నాయి. నేతల మధ్య వర్గపోరు పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా తయారైంది. తాజాగా ధర్మవరం పట్టణంలో ఓ ఫ్లెక్సీ కోసం మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి)ల అనుచరులు బాహాబాహీకి దిగారు. దీంతో, ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే, దీపావళి పండుగను పురస్కరించుకుని బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన జగ్గు అనే టీడీపీ నాయకుడు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ల ఫొటోలతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫొటో లేకపోవడంతో, అతని అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో, ఫ్లెక్సీని తొలగించేందుకు వారు యత్నించారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న సి.బత్తలపల్లి, ఓబుళనాయునిపల్లి, గంటాపురం గ్రామాలకు చెందిన పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ తొలగింపును అడ్డుకున్నారు. ఈ క్రమంలో, ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల వారు తమ వర్గీయులను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించుకున్నారు. ఈ సమయంలో కూడా ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీని తొలగించే యత్నం చేశారు. దీంతో, ఇరు వర్గాల వారు పోలీసుల ఎదుటే కొట్టుకున్నారు. చొక్కాలు చింపుతూ, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇరు వర్గాల వారు అధికార పార్టీకే చెందిన వారు కావడంతో ఏం చేయాలో పోలీసులకు పాలుపోలేదు. పరిస్థిితి ఉద్రిక్తంగా మారడంతో, డివిజన్ లోని పోలీసులందరినీ ధర్మవరంకు పిలిపించారు డీఎస్పీ. అనంతరం, పట్టణంలో 144 సెక్షన్ విధించారు.

More Telugu News