190 దేశాలుంటే, ఇండియాకు 130వ ర్యాంకా? ప్రపంచ బ్యాంకు నివేదికను అధ్యయనం చేయాలని ఆదేశించిన నరేంద్ర మోదీ
సులువుగా వ్యాపారం చేసుకోదగ్గ దేశాల జాబితాను ప్రపంచ బ్యాంకు విడుదల చేయగా, అందులో భారత ర్యాంకు కలవరపరిచే స్థాయిలో ఉండటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. మొత్తం 190 దేశాలకు ర్యాంకులివ్వగా, ఇండియా 130వ స్థానంలో నిలిచింది. దీంతో విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా కీర్తించబడే భారత్ కు ఇంత తక్కువ స్థాయి ర్యాంకు రావడానికి గల కారణాలను అన్వేషించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుదీకరణ జరగడం, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే వేగవంతమైన అనుమతులు, సులభ రుణాలు, పన్ను రాయితీలు వంటివి అందుబాటులో ఉన్నా, ర్యాంకు ఘోరంగా ఉండటంపై ఓ నెలలోపు నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాను మోదీ ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా, ప్రస్తుతం 130గా ఉన్న భారత ర్యాంకు సమీప భవిష్యత్తులోనే టాప్-50కి చేరేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని కూడా మోదీ ఆదేశించారని, లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నామని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన ర్యాంకు తనకు అసంతృప్తిని కలిగించిందని అన్నారు. కాగా, గత సంవత్సరం ఇదే ర్యాంకుల జాబితాలో 131వ స్థానంలో ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే.