అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు సల్ఫర్ గనిని పేల్చిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు... వేలాది మందికి తీవ్ర అస్వస్థత
ఇరాక్ లోని మోసుల్ నగరంలో ఐఎస్ఐఎస్ ఊహించని దారుణానికి ఒడిగట్టింది. నగరాన్ని తిరిగి హస్తగతం చేసుకునేందుకు భద్రతా దళాలు ఒక్కో అడుగూ వేసుకుంటూ వస్తున్న వేళ, ఆ ప్రాంతంలో ఉన్న సల్ఫర్ గనిని పేల్చింది. దీంతో వెలువడిన విషవాయువులను పీల్చి వేలాది మంది సాధారణ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికాగా, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన భద్రతాదళాలు, సైన్యంలోని ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించే ముందుకు సాగాలని ఆదేశించింది.
అమెరికా, ఇరాక్ సంయుక్త దళాలు మోసుల్ నగరాన్ని చుట్టుముట్టి, ఒక్కో ఉగ్రవాదినీ మట్టుపెడుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మోసుల్ కు 25 మైళ్ల దూరంలోని ముషారఖ్ సల్ఫర్ గనిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేల్చినట్టు ఇరాకీ ఫెడరల్ పోలీసు ప్రతినిధి కల్నల్ అబ్దుల్ రహమాన్ అల్ ఖాజాలి తెలిపారు. ఉగ్రవాదుల నుంచి నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐదు రోజుల నుంచి భీకర పోరు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ ఘటనతో సర్జికల్ మాస్కులు ధరించిన భద్రతా దళాలు మాత్రమే ముందడుగు వేస్తున్నాయని వివరించారు.