Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరగనుందా?... ట్రంప్ వ్యాఖ్యలతో కలకలం

ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం మనకు బాగా తెలిసిన వ్యవహారమే. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో కూడా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా? రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే, అవుననే అనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్, మీడియా కలసి రిగ్గింగ్ కు పాల్పడ్డాయని, నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఓటమి భయంతోనే డెమొక్రాట్లు ఇలాంటి నీచమైన చర్యలకు దిగుతున్నారని... ఈ వ్యవహారంపై తన సొంత పార్టీ నేతలు కూడా మౌనంగా ఉండటం మంచిది కాదని అన్నారు. రిగ్గింగ్ వ్యవహారంలో వైట్ హౌస్ కు కూడా ప్రమేయం ఉందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకు ముందు కూడా రిగ్గింగ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో, తన పాత వీడియోలను వెలుగులోకి తెచ్చి, తనకు మహిళల ఓట్లు దక్కకుండా మీడియా కుట్రకు పాల్పడిందని ఆయన విమర్శించారు.

More Telugu News