‘ధనిక రాష్ట్రంలో చెల్లింపులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి’?.. తెలంగాణ సర్కారుపై మరోసారి కోదండరాం ఆగ్రహం
తెలంగాణలో జేఏసీ నిర్వహించాల్సిన తదుపరి కార్యాచరణపై ప్రొ.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్లోని నాంపల్లి టీజేఏసీ కార్యాలయంలో నిర్వహిస్తోన్న భేటీ ముగిసింది. అందులో తెలంగాణలో విద్య, వైద్యం, ఐకాస కమిటీల నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రొ.కోదండరాం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి చెల్లింపులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిధుల చెల్లింపులపై కొత్త అనుమానాలు వస్తున్నాయని కోదండరాం అన్నారు. నిధులు తగ్గాయా? లేక దారి మళ్లుతున్నాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ప్రైవేటీకరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని అందించలేమని చెబుతున్నాయని అన్నారు.
సరైన వైద్యం అందక పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి రుసుములు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి చెల్లిస్తామన్నారని ఆయన చెప్పారు. ఇంకా 2140 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 90 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లోనే చదువుతున్నారని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో పేద విద్యార్థులు ప్రవేశించడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.