నెలకు రూ. 6,600కు ఐఎస్ఐఎస్ తరఫున ఉగ్రవాదిగా పనిచేశాను: చెన్నైలో అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ నోటి వెంట ఆసక్తికర విషయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెలకు రూ. 6,600కు ఐఎస్ఐఎస్ తరఫున ఉగ్రవాదిగా పనిచేశాను: చెన్నైలో అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ నోటి వెంట ఆసక్తికర విషయాలు

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా పనిచేసి, ఇండియాలో ఉగ్రదాడులు జరపాలని వచ్చి అరెస్టయిన సుబానీ హాజా మొయిద్దీన్ ను విచారించిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను అతని నోటి నుంచి రప్పించారు. ఇరాక్ వెళ్లిన తనకు మోసుల్ లో శిక్షణ ఇచ్చారని, ఆపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కలసి తాను పోరాడానని చెప్పాడు. తాను ఇండియాకు వచ్చిన తరువాత గడచిన రెండేళ్లలో 60 మందిని ఐఎస్ఐఎస్ లో చేర్చినట్టు తెలిపాడు. కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన మొయిద్దీన్, కొన్నాళ్ల క్రితం దక్షిణాదిన దాడులకు కుట్ర చేస్తుండగా, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2015 ఏప్రిల్ 8న యాత్రకని ఇంట్లో తల్లిదండ్రులకు, భార్యకు చెప్పిన తాను, ఇస్తాంబుల్ మీదుగా ఇరాక్ వెళ్లానని, విజిటింగ్ వీసాపై చెన్నై నుంచే తన ప్రయాణం మొదలైందని మొయిద్దీన్ విచారణలో వెల్లడించాడు. ఇస్తాంబుల్ వెళ్లిన తరువాత, కొంతమంది పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ కు చెందిన ఫైటర్లతో కలసి సరిహద్దులు దాటి ఇరాక్ లోకి ప్రవేశించినట్టు చెప్పాడు. మరో 30 మందితో కలిపి తనకు శిక్షణ ఇచ్చారని, వారిలో ఆస్ట్రేలియా, లెబనాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని తెలిపాడు. తనకు ఓ ఆఫ్గన్ ట్రైనర్ చాలా కఠినమైన శిక్షణ ఇచ్చాడని, ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ అనంతరం చిన్న చిన్న గదుల్లో ఉంచారని చెప్పుకొచ్చాడు. శిక్షణ తరువాత తొలుత కాపలా కాసే బాధ్యతలను, ఆపై వార్ జోన్ కు పంపారని, కుర్దిష్, ఇరాకీ సైన్యంతో తలపడ్డానని, అందుకు నెలకు 100 యూఎస్ డాలర్లు (సుమారు రూ. 6,600) ఇచ్చారని చెప్పాడు. సెప్టెంబర్ లో తిరిగి ఇస్తాంబుల్ కు వెళ్లి, రెండు వారాల పాటు ఉండి, ఆపై ఇండియన్ కాన్సులేట్ అధికారులను కలిసి, ముంబై మీదుగా ఇండియాకు వచ్చినట్టు చెప్పాడు. ఆపై తిరునల్వేలిలో ఓ ఆభరణాల దుకాణంలో పనికి కుదిరి పేలుళ్లకు ప్లాన్ వేస్తున్నామని చెప్పాడు. శివకాశీ నుంచి రసాయనాలు తెచ్చి, బాంబులు తయారు చేసి వివిధ ప్రాంతాల్లో ఒకే చోట పేల్చాలన్నది తమ లక్ష్యమని వివరించాడు. ఆపై కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ నేతలను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్టు చెప్పాడు. ఇప్పుడు మొయిద్దీన్ ను మరింత లోతుగా విచారించి, ఉగ్రవాదుల దాడి పద్ధతులు, శిక్షణా విధానం, నిధులు ఎలా సమకూరుతాయి? యుద్ధంలో మహిళల పాత్ర ఎంతవరకూ ఉంటుంది? తదితర విషయాలను వెలికి తీయాలని నిర్ణయించారు.

More Telugu News