దూసుకువస్తున్న హరికేన్... ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ఒబామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దూసుకువస్తున్న హరికేన్... ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ఒబామా

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపు అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ దూసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో, అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఈ హరికేన్ సృష్టించిన విధ్వంసానికి కరేబియన్ దేశమైన హైతీలో 283 మంది దుర్మరణం పాలయ్యారు. హైతీలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో... భారీ నష్టం సంభవించింది. చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. తన జీవితంలో ఇంతటి భయంకరమైన హరికేన్ ను చూడలేదని ఆ దేశ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి స్వయంగా చెప్పారంటే... దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ హరికేన్ దెబ్బకు హైతీలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలను సైతం ఆదివారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో, మాథ్యూ హరికేన్ ఫ్లోరిడా రాష్ట్రం వైపు వెళుతున్న క్రమంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫ్లోరిడాలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం సమీపించే కొద్దీ హరికేన్ తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ హరికేన్ ప్రభావంతో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీర ప్రాంతం మొత్తం అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

More Telugu News