ఆ సమయంలోనే జిల్లాల విభజనపై చర్చించాం: సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగర్ రావు సమక్షంలో జిల్లాల విభజనపై చర్చ జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం అధికారిక నివాసంలో నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చెరువుల పునరుద్ధరణ, జిల్లాల విభజన అత్యంత శాస్త్రీయంగా జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
జిల్లాల విభజన అనేది రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలతో జరగకూడదని, ప్రజాభీష్టం మేరకే జరగాలని అన్నారు. జిల్లాల విభజనలో ప్రజాభీష్టం మేరకు మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ముసాయిదాలో రూపొందించిన జిల్లాలు, డివిజన్లు, మండలాల కంటే ఎక్కువ మొత్తంలో పాలనా విభాగాలు అవసరమనుకుంటే వాటి సంఖ్యను పెంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.