బీహార్ కు నేను శకుని మామను!: మార్కండేయ కట్జూ మరో వివాదాస్పద ట్వీట్
కశ్మీర్ కావాలంటే బీహార్ ను కూడా తీసుకోవాల్సిందే అని షరతుపెడితే పాకిస్థాన్ తోకముడుస్తుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై దేశద్రోహం కేసు నమోదైంది. అధికార జేడీయూ ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఫిర్యాదు మేరకు శాస్త్రి నగర్ పోలీసు స్టేషన్ లో ఆయనపై సెక్షన్ 124 ఏ (దేశద్రోహం) నమోదైంది. మరొక న్యాయవాది కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీస్ స్టేషన్ లో కేసుపై కట్జూ తాజాగా స్పందిస్తూ, బీహారీలకు కావాలంటే తనపై ఐక్యరాజ్యసమితిలో కూడా ఫిర్యాదు చేయవచ్చునని చమత్కరించారు. 'బీహార్ కు నేను అమ్మనా, నాన్ననా? అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశ్నిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, బీహార్ కు నేను అమ్మానాన్నను కాదు కానీ శకుని మామను' అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన 'వస్త్రాపహరణం జరుగుతుంటే ద్రౌపది గౌరవాన్ని కాపాడుకునేందుకు కృష్ణుణ్ని ప్రార్థించింది' అంటూ నితీశ్ ను పరోక్షంగా దెప్పి పొడిచారు.