: ఉండవల్లి ఊహలను నేను ఖండించకపోతే, అవే ప్రామాణికమవుతాయి: జైపాల్ రెడ్డి
రాష్ట్ర విభజనపై ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకంలోని ఊహలను, కట్టుకథలను తాను ఖండించకపోతే, చివరికి అవే ప్రామాణికమవుతాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఉండవల్లి తన పుస్తకంలో కట్టుకథలు రాశారని అన్నారు. తెలంగాణ బిల్లు తెచ్చే విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధిలేదని సుష్మాస్వరాజ్, అప్పటి స్పీకర్ మీరాకుమార్ తో వాదనకు దిగారని, ఆ వాదన జరుగుతుండగా తాను స్పీకర్ ఛాంబర్ కు వెళ్లానని చెప్పారు. ఆ రోజు స్పీకర్ ఛాంబర్ లో ఏమి జరిగిందో చాలా మందికి తెలియదని, జైరాం రమేష్ కు కూడా తెలియదని ఆయన అన్నారు. నాడు పార్లమెంట్ లో విభజన బిల్లును సుశీల్ కుమార్ షిండే ప్రవేశ పెట్టారని, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ మాట్లాడారని అన్నారు. అద్వానీ కూడా బీజేపీ నిర్ణయానికి కట్టుబడి విభజన బిల్లుకు అనుకూలంగా లేచి నిలబడ్డారని అన్నారు. తెలంగాణ బిల్లు ఆరోజు పాస్ కావడంలో తనది అతి కీలకమైన పాత్ర అని, ఓటింగ్ జరుగుతుండగా పార్లమెంట్ లో ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు నిలిచిపోయాయో తనకు తెలియదని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.