: మీకు దమ్ముంటే పాకిస్థాన్‌కు ఆత్మాహుతి బాంబర్లను పంపండి.. రాజ్‌థాక్రేకు సమాజ్‌వాదీ పార్టీ సవాల్
బాలీవుడ్‌లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు అధికారికంగా వచ్చే వారిని భయపెట్టడం కాదని, దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు ఎస్పీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అబు ఆజ్మీ శనివారం సవాల్ విసిరారు. ‘‘పాకిస్థాన్ భారత్‌పైకి ఆత్మాహుతి దాడులకు దిగుతోంది. మీకు దమ్ముంటే, దేశంపై ప్రేమ ఉంటే లాహోర్, కరాచీలకు సూసైడ్ బాంబర్లను పంపించండి. అంతేకానీ ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు’’ అని రాజ్‌థాక్రేకు అబు అజ్మీ సూచించారు. ‘‘మీరో చిన్న నేత. మీ పరిధి మహారాష్ట్ర వరకే. పాకిస్థాన్ గురించి ఎందుకు? గడ్చిరోలి, చంద్రాపూర్‌లో నక్సల్స్ పోలీసులపై దాడులకు దిగుతున్నారు. కనీసం అక్కడికైనా మీ కార్యకర్తలను పంపించి భద్రతా దళాలను రక్షించండి. అప్పుడు మీరు దేశం కోసం పాకులాడుతున్నట్టు నేను అర్థం చేసుకుంటాను’’ అని అబు అజ్మి పేర్కొన్నారు.