Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కొడుకువు కాబట్టే పదవి, పేరు... నీ వల్లే ప్రధానిని కాలేకపోయా!: అఖిలేష్ కు ములాయం వార్నింగ్

తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ ను ఎన్నడూ బహిరంగంగా విమర్శించని సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, తన వైఖరికి భిన్నంగా ప్రవర్తించారు. అందరి ముందే కుమారుడికి చీవాట్లు పెట్టారు. సోదరుడు శివపాల్ ను కుమారుడు విభేదిస్తున్న వేళ, సమస్యను పరిష్కరించేందుకు యత్నించిన ములాయం, కార్యకర్తల ముందే అఖిలేష్ కు బుద్ధి చెప్పారు. "నువ్వు నా కుమారుడివి కాబట్టే నిన్ను సీఎంగా ప్రజలు అంగీకరించారు. పదవి, పేరు లభించిన కారణాన్ని తెలుసుకో. నేను, శివరాజ్ పార్టీని పెట్టినప్పుడు నువ్వు స్కూలుకెళ్లే చిన్న పిల్లాడివి. సీఎం అయిన తరువాత ఏం జరిగింది? నీ మాట ప్రకారం వెళితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఐదుగురే గెలిచారు. శివపాల్ చెప్పినట్టు వినుంటే 30 నుంచి 35 సీట్లు లభించేవి. నేను ప్రధాన మంత్రిని అయ్యుండేవాడిని. నీ వల్ల దక్కుతుందనుకున్న ప్రధాని పదవి దక్కలేదు" అని వ్యాఖ్యానించారు. పార్టీ మేనిఫెస్టోయే ఓట్లను సాధించిపెట్టి, అఖిలేష్ ను సీఎంను చేసిందని, దాన్ని రాసింది శివపాల్, రాంగోపాల్ యాదవ్ లేనని ములాయం గుర్తు చేశారు. పార్టీ కోసం వారు అనునిత్యమూ శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో అమర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఓ కార్యకర్త డిమాండ్ చేయగా, ములాయం మండిపడ్డారు. "అమర్ సింగ్ ఎవరో నీకు తెలుసా? నాపై సీబీఐ విచారణ జరుగుతున్న వేళ, అండగా నిలిచేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోయినా, అమర్ ఒక్కరే నిలిచారు" అంటూ, ఆయనపై ఎలాంటి చర్యలూ ఉండబోవన్న సంకేతాలిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని స్కీములూ తన ఆలోచనలేనని చెప్పుకొచ్చారు.

More Telugu News