నేను తప్పటడుగు వేస్తే రాష్ట్రానికే నష్టం..: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను తప్పటడుగు వేస్తే రాష్ట్రానికే నష్టం..: చంద్రబాబు

తాను తప్పటడుగు వేస్తే యావత్ రాష్ట్రానికే నష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాను హోదా కోసమే పట్టుబట్టానని, అయితే హోదాతో ఒనగూరే ప్రయోజనాలను ప్యాకేజీతో భర్తీ చేస్తామంటేనే ఓకే చెప్పానని స్పష్టం చేశారు. విజ్ఞతతో ఆలోచించే దీనికి అంగీకారం తెలిపానని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దేవినేని నెహ్రూ టీడీపీలో చేరిన సందర్భంగా విజయవాడ, గుణదలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు సాయం చాలా అవసరమని, అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి అంగీకరించినట్టు పేర్కొన్నారు. హోదాపై కొందరు గాలి మాటలు మాట్లాడుతున్నారని, హామీలపై చట్టబద్ధతకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘హోదా వల్ల వచ్చే ప్రతీ ఒక్క దాన్ని ప్యాకేజీతో భర్తీ చేస్తామని కేంద్రం చెప్పింది. విజ్ఞతతో ఆలోచించా. విభజన జరిగి రెండున్నర సంవత్సరాలు గడిచింది. రాష్ట్రం పూర్తిగా కష్టాల్లో ఉంది. ఇప్పుడు సాయం కావాలి. అన్నీ ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీకి అంగీకరించాం’’ అని బాబు పేర్కొన్నారు. వైసీపీ, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుప్పిగంతులు వేసినా, కుట్రలు చేసినా ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తానైతే అభివృద్ధి చేయగలననే నమ్మకంతోనే గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేసే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News