నితీశ్ పై నమ్మకం లేకుంటే హ్యాపీగా వెళ్లిపొండి: ఆర్జేడీపై కాంగ్రెస్ నిప్పులు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న వేళ, నితీశ్ కు మద్దతుగా కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహాకూటమి భాగస్వామిగా కూడా ఉన్న కాంగ్రెస్, నితీశ్ కుమార్ నాయకత్వం ఇష్టం లేకుంటే ప్రభుత్వం నుంచి బయటకు పోవచ్చని ఆర్జేడీకి సలహా ఇచ్చింది.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాశాఖ మంత్రి అశోక్ చౌధురి మాట్లాడుతూ, లాలూ వర్గం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని వీడి వెళ్లవచ్చని, వారి విమర్శల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని నిప్పులు కురిపించారు. కాగా, బీహార్ లో నితీశ్ కుమార్ పార్టీతో పోలిస్తే, లాలూ వర్గానికే అధిక అసెంబ్లీ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. అయినా ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, నితీశ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టగా, అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఆర్జేడీ నేతలు ఇబ్బంది పెట్టే విమర్శలు చేస్తూనే ఉన్నారు.