: రెండు నెలల్లో రూ.25 వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు?... ‘సహారా’కు సుప్రీం సూటి ప్రశ్న!
‘తక్కువ కాలంలో అధిక వడ్డీ’ పేరిట దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించిన సహారా ఇండియా పరివార్ కు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లకు సొమ్ము చెల్లించడం లేదన్న కారణంతో సహారా పరివార్ పై కేసు నమోదు కాగా... ఆ సంస్థ చీఫ్ సుబ్రతో రాయ్ నెలల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇటీవలే బెయిల్ పై ఆయన విడుదల కాగా... గడచిన రెండు నెలల కాలంలో సహారా తన డిపాజిట్ దారులకు రూ.25 వేల కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేసింది. అయితే కేవలం రూ.10 వేల కోట్ల మేర డిపాజిట్ చేస్తే బెయిలిస్తామన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సుబ్రతో రాయ్ పాటించలేకపోయారు. జైల్లో తాను ఉంటే... నిధుల సమీకరణ సాధ్యం కాదన్న ఆయన జైల్లోనే నెలల పాటు ఉన్నారు. తాజాగా ఆయన బయటకు రాగానే రూ.25 వేల కోట్ల చెల్లింపులు జరిగిన తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. నిన్న ఈ కేసుపై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘అంత భారీ మొత్తం ఆకాశం నుంచి ఊడిపడదు కదా. ఎక్కడ నుంచి ఈ సొమ్ము తెచ్చారు? ఇతర కంపెనీలు, ఇతర స్కీముల ద్వారా సేకరించారా? బ్యాంకు ఖాతాల నుంచి వెనక్కు తీసుకున్నారా? ఆస్తులు అమ్మారా? ఈ మూడు కాకుండా మరో ఆధారం లేదు కదా? మీ క్లెయింట్ కు వేలాది కోట్ల రూపాయల సొమ్మును చెల్లించగల సామర్థ్యం ఉందన్న విషయంలో మాకెలాంటి సందేహం లేదు. అయితే రెండు నెలల కాలంలో అంత పెద్ద మొత్తం ఎలా సమీకరించారన్న విషయంలో మీ వివరణే మాకు జీర్ణం కావడం లేదు. మీరేం పండోరా బాక్సును తెరవాల్సిన అవసరం లేదు. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం చెబితే చాలు’’ అని సహారా తరఫు న్యాయవాది కపిల్ సిబల్ పై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.