: పేలుతున్న 'శాంసంగ్ గెలాక్సీ నోట్ 7'లు... ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేయనున్న సంస్థ
చార్జింగ్ పెడుతున్న వేళ, 'శాంసంగ్ గెలాక్సీ నోట్ 7' స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ఈ మోడల్ ఫోన్లన్నింటినీ రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పేరును వెల్లడించని శాంసంగ్ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. "మా కస్టమర్ల భద్రత మాకు అత్యంత ముఖ్యం. శాంసంగ్ పై ఎంతో నమ్మకంతో ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోము. ఫోన్లన్నీ రీకాల్ చేయనున్నాం" అని వివరించారు. గెలాక్సీ 7 నోట్ లు పేలుతున్నాయన్న వార్త గురువారం నాడు సంస్థ ఈక్విటీపైనా ప్రభావం చూపింది. దీనిపై శాంసంగ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఫోన్లను పరీక్షిస్తున్నామని, తమ కస్టమర్లకు అత్యంత క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను మాత్రమే తాము అందిస్తామని వెల్లడించింది. మొత్తం షిప్పింగ్ చేసిన ఫోన్లలో 0.1 శాతం యూనిట్లలో మాత్రమే సమస్యలకు ఆస్కారముందని శాంసంగ్ మరో అధికారి తెలిపారు. కాగా, ఈ ఫోన్ గత నెల 10వ తేదీన మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని ధర రూ. 65 వేలు.