ఏపీకి ‘హోదా’ వచ్చేసినట్టే!... ప్రధాని పగలబడి నవ్వడమే సూచన అన్న వెంకయ్య!
ఏపీలో అధికార పార్టీ టీడీపీతో పాటు విపక్షాలన్నీ ఒక్కుమ్మడిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఈ నేపథ్యంలో నిన్న హస్తినలో జరిగిన పలు పరిణామాలను పరిశీలిస్తే... ఏపీకి ప్రత్యే హోదా కోసం కేంద్రం నుంచి కొంత మేర సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడైతే... ఏకంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని కూడా నిన్న వ్యాఖ్యానించారు. నిన్న టీడీపీ ఎంపీల బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంత్ర పఠనంతో మోదీ పగలబడి నవ్విన విషయమూ విదితమే. ఈ విషయం తెలుసుకున్న వెంకయ్య టీడీపీ నేతలతో కీలక వ్యాఖ్య చేశారు. మోదీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్లేనని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని కూడా ఆయన చెప్పారట.