Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.50 టికెట్ రూ.500.. రూ.100 టికెట్ వెయ్యి.. బ్లాక్‌లో 'కబాలి' టికెట్ల ధర ఇది!

కబాలి.. కబాలి.. దాదాపు నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇది తప్ప వేరే ఏదీ వినపించలేదంటే అతిశయోక్తి కాదేమో. సినిమా రిలీజ్ కోసం రజనీకాంత్ అభిమానులు సహా సినీ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురుచూశారు. టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. నిన్న సినిమా విడుదల కావడంతో హైదరాబాద్‌లోని ‘కబాలి’ థియేటర్లు జనసంద్రమయ్యాయి. టికెట్ల కోసం ప్రజలు పోటీ పడ్డారు. దీనిని అవకాశంగా చేసుకున్న కొందరు వందలాది టికెట్లను బ్లాకులో విక్రయించారు. టికెట్ ధరకు పదింతలు వసూలు చేస్తూ అభిమానుల జేబులను గుల్ల చేశారు. రూ.50 టికెట్‌ను రూ.500లకు, వంద రూపాయల టికెట్‌ను వెయ్యికి ఇలా అన్ని టికెట్లను పదింతల ఎక్కువకు విక్రయించారు. రేటుకు వెనుకాడకుండా టికెట్లు దక్కించుకోవడానికి అభిమానులు పోటీ పడడం గమనార్హం. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక థియేటర్ల మేనేజ్‌మెంట్ హస్తం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. చందానగర్‌లోని శ్రీలత థియేటర్‌లో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ థియేటర్ యజమాని జై రామ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 18 ఆన్‌లైన్ టికెట్లు, 13 రెగ్యులర్ టికెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బ్లాక్ టికెట్ల వ్యవహారంలో కొన్ని యాజమాన్యాలు పరోక్ష పాత్ర పోషిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మొత్తంగా 126 కబాలి టికెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 26 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.11,640 స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News