ట్రంప్ కు కేన్సర్ భయం, హిల్లరీకి హైపో థైరాయిడిజమ్!
ప్రజల్ని పాలించేవారు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సమర్థవంతమైన పాలన ఉంటుంది... వినేందుకు ఇది కాస్త అసంబద్ధంగానే ఉన్నప్పటికీ, పాలకులు ఆరోగ్యవంతులై ఉండాలని అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కోరుకుంటారు. ఇండియాలో ఈ దిశగా ఆలోచించేంత తీరిక కూడా ప్రజల్లో కనిపించకపోయినా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ, అభ్యర్థుల ఆరోగ్యం సైతం ఓట్లను ఆకర్షించేదే. ఈ నేపథ్యంలో బరిలోకి దిగే డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ల మీద బులెటిన్లు విడుదల అవుతున్నాయి. ఆ వివరాలు సైతం గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. తాజా బులెటిన్ ప్రకారం...
డొనాల్డ్ ట్రంప్...
* 70 సంవత్సరాల ట్రంప్ వైద్య నివేదికలో కొన్ని వివరాలే ఉన్నాయి.
* పదేళ్ల వయసులో అపెండిసైటిస్ శస్త్రచికిత్స జరిగింది.
* ప్రొస్టేట్ కేన్సర్ రావచ్చన్న భయంతో క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటారు.
* బీపీ నార్మల్, కొలెస్టరాల్ ఉంది. దానికి మందులు (స్టాటిన్స్) వాడుతున్నారు.
* గుండెపోటు వచ్చే సమస్య కూడా ఉంది.
* కొలోన్ కేన్సర్ నుంచి తప్పించుకునేందుకు మందులు వాడుతున్నారు.
* ఏడాదిలో 15 పౌండ్ల బరువు పెరిగారు.
* రోజుకు మూడు నుంచి నాలుగు గంటలే నిద్రిస్తారు.
హిల్లరీ క్లింటన్...
* 69 సంవత్సరాల హిల్లరీకి బీపీ, కొలెస్టరాల్ లేవు.
* ఇటీవల గుండె పరీక్షలు చేయించుకుంటే అంతా నార్మల్.
* 2012లో మెదడులో రక్తనాళాలు గడ్డకట్టాయి.
* ఆపై కోలుకున్న హిల్లరీ, మళ్లీ ఇదే పరిస్థితి రాకుండా రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నారు.
* హైపో థైరాయిడిజమ్ ఉంది. దీంతో హార్మోన్ మందులు, విటమిన్ బీ12 ఔషధాలు వాడుతున్నారు.
* ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, యోగా, నడక చేయడంతో పాటు, పళ్లు, కూరగాయలు అధికంగా తింటారు.
* సమయానుసారంగా వైద్య పరీక్షలు చేయించుకుంటారు.