అమరావతిలో దేశంలో కెల్లా అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం!
దేశంలో కెల్లా అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే అవకాశముంది. సమీప భవిష్యత్ లో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరగనుంది. అబుదాబికి చెందిన ఎన్ఎంసీ హెల్త్ కేర్, యూఏఈ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కలసి ఈ కన్వెన్షన్ సెంటర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ముందుకు వచ్చాయి. ఈ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎన్ఆర్ఐ బీఆర్ శెట్టి ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబును నిన్న కలిసిన సందర్భంగా చెప్పినట్లు సమాచారం.
సరైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే కనుక ఈ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఈ మెగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.12,000 కోట్లు అని, ఈ కన్వెన్షన్ సెంటర్ ను 10,000 మంది కూర్చునేందుకు వీలుగా నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఒక ఎగ్జిబిషన్ సెంటర్, ఒక ఫైవ్ స్టార్ హోటల్, అమ్యూజ్ మెంట్ పార్క్ ను కూడా నిర్మించేందుకు బీఆర్ శెట్టి ముందుకు వచ్చారు. అంతేకాకుండా గ్రూప్ హౌస్ లు, మెగా ఆసుపత్రుల్లో కూడా శెట్టి గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచిందని సంబంధిత వర్గాల సమాచారం.