దళిత యువకులను కట్టేసి కొట్టిన అంశంపై పార్లమెంటులో రగడ... రాజ్ నాథ్ ప్రకటనపై దుమారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దళిత యువకులను కట్టేసి కొట్టిన అంశంపై పార్లమెంటులో రగడ... రాజ్ నాథ్ ప్రకటనపై దుమారం!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు గ‌రం గ‌రంగా కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల గుజరాత్లోని ఉనాలో న‌లుగురు దళిత యువకులను గోమాంసం పంపిణీ చేస్తున్నారంటూ గోసంర‌క్ష‌ణ సంస్థ స‌భ్యులు చితక్కొట్టిన ఘటన తెలిసిందే. నలుగురు యువ‌కుల‌ను ప‌ట్టుకున్న గోసంర‌క్ష‌ణ సంస్థ స‌భ్యులు వారిని అర్ధనగ్నంగా మార్చి, ఓ కారుకి వారి చేతుల‌ని క‌ట్టేసి కొట్టారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఓ వ్య‌క్తి తీసిన ఈ ఘ‌ట‌న దృశ్యాలు దేశమంత‌టా కలకలం రేపాయి. ఈ అంశంపైనే ఈరోజు పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భల్లో ర‌గ‌డ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలోనే కాక‌ దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో గ‌ళం విప్పుతున్నాయి. ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్పడుతోన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ద‌ళిత యువ‌కుల‌పై దాడిపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చించాల్సిందేన‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి డిమాండ్ చేశారు. అయితే దానికి ఛైర్మ‌న్ నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతో బీఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఈరోజు రాజ్య‌స‌భ నాలుగుసార్లు వాయిదా ప‌డింది. కాగా, గుజ‌రాత్‌లో ద‌ళితుల‌పై దాడి అంశంలో లోక్ సభలో కేంద్రం హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. దళితులపై జ‌రిగిన‌ దాడిని ఖండించాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశార‌ని, ఘ‌ట‌న‌ను తీవ్రంగా తీసుకున్నార‌ని, ఇటువంటి దాడులు సాంఘిక నేరమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశ ప్ర‌జ‌లు ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను స‌వాలుగా తీసుకోవాల‌ని, వాటి నిర్మూల‌న‌కు కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా గుజరాత్ లో దళితులపై భారీ సంఖ్యలో ఇటువంటి దాడులు జరిగాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాల‌న‌లో జ‌రిగిన దాడుల కన్నా బీజేపీ సర్కార్ పాల‌న‌లో జ‌రిగిన‌ దాడులు త‌క్కువేన‌ని, వాటిని ప్ర‌భుత్వం అరిక‌ట్ట‌గ‌లిగింద‌ని అన్నారు. గుజ‌రాత్ లో జ‌రిగిన ఘ‌ట‌న కేసులో ఇప్ప‌టికే తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారని, ఏడుగురిని రిమాండ్ కు పంపించారని ఆయ‌న పేర్కొన్నారు. ఘ‌ట‌న ప‌ట్ల ఉదాసీన‌త ప్ర‌ద‌ర్శించిన నలుగురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారని ఆయ‌న తెలిపారు. కాంగ్రెస్ పై రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల ప‌ట్ల, దళితులపై దాడుల అంశంపై ఆయన చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్ర‌హ‌ం వ్యక్తం చేశారు. సమస్యను హోంమంత్రి మరింత పెద్దదిగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News