కృష్ణా పుష్కరాల్లో నదీ హారతిచ్చే పురోహితులకు ‘నిఫ్ట్’ డిజైనర్ దుస్తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణా పుష్కరాల్లో నదీ హారతిచ్చే పురోహితులకు ‘నిఫ్ట్’ డిజైనర్ దుస్తులు

వచ్చే నెల 12 వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా నదికి హారతి ఇచ్చే సమయంలో సంబంధిత పురోహితులు సాంప్రదాయక దుస్తుల్లో దర్శనమివ్వనున్నారు. ఈ విషయమై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)ని ఏపీ ఎండోమెంట్స్ డిపార్టు మెంట్ సంప్రదించింది. గుంటూరు జిల్లా మంగళగిరి, అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తయారైన సాంప్రదాయక దుస్తులతో ఆకర్షణీయమైన రీతిలో పురోహితులకు దుస్తులు రూపొందించనున్నారు. ధోతీ, అంగవస్త్రంతో కూడిన నాలుగు రకాల దుస్తులను నిఫ్ట్ హైదరాబాద్ విభాగం డిజైన్ చేసినట్లు ఫ్యాషన్ డిజైన్ వింగ్ ప్రొఫెసర్ మాలిని పేర్కొన్నారు. ఎరుపు, పసుపు, గ్రీన్, ఆరెంజ్ వంటి ముదురు రంగుల దుస్తులను ‘కృష్ణా హారతి’ ఇచ్చే పురోహితుల కోసం రూపొందిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమం నిమిత్తం పూజారులు ధరించిన దుస్తులపై సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలోనే కృష్ణా పుష్కరాల్లో నదీమ తల్లికి హారతివ్వనున్న పూజారులకు ఈ కొత్త దుస్తులు రూపొందిస్తున్నట్లు సమాచారం. కాగా, కృష్ణా పుష్కరాల్లో నదీ హారతి ఇచ్చేందుకు గాను 9 మంది పురోహితులను ఎంపిక చేశారు. ఓం కార, నాగ, చంద్ర, నంది, నక్షత లాంటి తొమ్మిది రకాల హారతులను పుష్కరాల సమయంలో నదీమ తల్లికి ఇవ్వనున్నారు. పుష్కరాలు జరిగే రోజుల్లో ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు నదీ హారతి ప్రారంభించి... పదిహేను నిమిషాల్లో ముగిస్తారు. హారతి కార్యక్రమానికి ముందుగా, కృష్ణా నదీ ప్రాశస్త్యత గురించి కొంచెం సేపు పరిచయ కార్యక్రమం ఉంటుందని సమాచారం.

More Telugu News