ప్రతీ ఎమ్మెల్యే ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి: గవర్నర్ నరసింహన్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఈరోజు మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో గవర్నర్ నరసింహన్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ 1,05,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నరసింహన్ కార్యక్రమంలో భాగంగా జమ్మి మొక్కను నాటి ప్రజలను ప్రోత్సహించారు. ఆ గ్రామంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
బాలవికాస వాటర్ ప్లాంట్, కూరగాయల పంటలు, ఇంకుడు గుంతలను, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు జరుగుతోన్న తీరుపై ఆరా తీశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపూర్లో జరుగుతోన్న అభివృద్ధి పనులను నరసింహన్ కొనియాడారు. ‘స్వర్ణ ఇబ్రహీంపూర్ను నేడు నేను చూశాను’ అని నరసింహన్ వ్యాఖ్యానించారు. గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయని ఆయన ప్రశంసించారు. అక్కడ జరిగిన అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమయిందని ఆయన అన్నారు.
సర్కార్ ఎన్ని పనులు మొదలు పెట్టినా అవి ప్రజల భాగస్వామ్యం లేనిదే ముందుకెళ్లలేవని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ప్రతీ ఎమ్మెల్యే బాధ్యతగా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.