రాత్రంతా అసెంబ్లీలోనే పడుకున్న కన్నడ విపక్ష ఎమ్మెల్యేలు
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య సర్కారుకు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో డీఎస్పీ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో హోం మంత్రి కేజే జార్జి హస్తముందంటూ విపక్ష సభ్యులు నిన్న అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. డీఎస్పీ ఆత్మహత్యపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేశామని సిద్ధరామయ్య ప్రకటించినా శాంతించని విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి.
దీంతో స్పీకర్ సభను నేటికి (గురువారానికి) వాయిదా వేశారు. అయినా శాంతించని విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీని వదిలి వెళ్లేందుకు నిరాకరించాయి. రాత్రంతా అసెంబ్లీలోనే చక్కగా దుప్పట్లేసుకుని పడుకున్నారు. ఎమ్మెల్యేల వినూత్న నిరసనతో నేటి ఉదయం ఆయా పార్టీలు ఈ విషయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు తెర తీశాయి. కేజే జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళన విరమించేది లేదని ఆ పార్టీలు తేల్చిచెప్పాయి.