అడుక్కొచ్చయినా ఇవ్వాల్సిందే... విడాకుల అనంతరం మనోవర్తి విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత, మనోవర్తిని ఎలాగైనా చెల్లించాల్సిందేనని, ఆమె బతికేందుకు బిచ్చమెత్తయినా డబ్బు ఇవ్వాల్సిందేనని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. వివరాల్లోకి వెళితే, శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన సెల్వ రాజన్, తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టికి చెందిన శ్రీరంగ సుభద్రలు భార్యాభర్తలు.
మూడు సంవత్సరాల సంసారం తరువాత విభేదాలు వచ్చి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఆపై సుభద్ర తన ఇంటి అద్దె, జీవన భృతికి దారి చూపాలని పిటిషన్ వేయగా, నెలకు రూ. 10 వేలు, ఆపై నష్టపరిహారంగా రూ. 50 వేలు చెల్లించాలని సెల్వరాజన్ ను కోర్టు ఆదేశించింది. తనకు ఎలాంటి ఉద్యోగమూ లేదని, ఆ డబ్బు చెల్లించలేనని రాజన్ హైకోర్టును ఆశ్రయించగా, విచారించిన కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోవర్తి చెల్లించాల్సిందేనని తీర్పిచ్చింది.