హైకోర్టులో బుగ్గనకు ఎదురుదెబ్బ!... పీఏసీ చైర్మన్ వైఖరిపై దేవినేని నిప్పులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైకోర్టులో బుగ్గనకు ఎదురుదెబ్బ!... పీఏసీ చైర్మన్ వైఖరిపై దేవినేని నిప్పులు!

రాయలసీమ తాగు, సాగు నీటి కష్టాలను తీరుస్తుందని భావిస్తున్న గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు విషయంలో వైసీపీ యువనేత, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వాదన తప్పని తేలిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా చెర్వుపల్లి గ్రామంలో సేకరించదలచిన దాదాపు 9 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదంటూ గతేడాది బుగ్గన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... తుది తీర్పు వెలువడే దాకా సదరు భూమికి సంబంధించిన సేకరణను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బుగ్గన వాదన తప్పని రెవెన్యూ, జలనవరుల శాఖ అధికారులు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొన్న (సోమవారం) విచారణ చేపట్టిన హైకోర్టు.. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన వాదనను సమర్థించింది. బుగ్గన ఆరోపించినట్లుగా సదరు భూమి ప్రైవేట్ వ్యక్తులది కాదని చెప్పిన హైకోర్టు... సదరు భూమిని సేకరించుకోవచ్చని ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గాలేరు- నగరి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో నిన్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... బుగ్గన వైఖరిపై ఫైరయ్యారు. బాధ్యత గల పీఏసీ చైర్మన్ పదవిలో ఉన్న బుగ్గన... ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణకు సహకరించాల్సింది పోయి అడ్డంకులు కలిగిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణను అడ్డుకునేందుకు బుగ్గన యత్నించారని, న్యాయపరమైన చిక్కులు కల్పించారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News