యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్... ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారు: ఆజాద్ ప్రకటన
2017లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా యూపీసీసీ చీఫ్ గా బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ను నియమించింది. ఈ మేరకు ప్రియాంక గాంధీతో గంటపాటు సమావేశమైన యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్ భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటారని అన్నారు. అలాగే యూపీసీసీ చీఫ్ గా రాజ్ బబ్బర్ ను పార్టీ నియమించిందని ఆయన తెలిపారు.
దీంతో యూపీలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానానికి ఇంకా సమయం ఉందని ఆయన తెలిపారు. అయితే, రాజ్ బబ్బర్ నియామకంతో యూపీ పీసీసీ కార్యాలయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంత మంది మిఠాయిలు పంచుకోగా, మరికొందరు విసవిసా నడుచుకుని వెళ్లిపోయారని తెలుస్తోంది. కాగా, గత కొంత కాలంగా బ్రాహ్మణ వ్యక్తిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారని జరిగిన ప్రచారానికి రాజ్ బబ్బర్ నియామకం తెరదించింది. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన రాజ్ బబ్బర్ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.