ఢిల్లీలో విషాదం.. గొంతు తెగ్గోసిన గాలిపటం దారం
గాలిపటం ఎగరేసే దారానికి గొంతును తెగ్గోసేటంత శక్తి ఉంటుందా..? మామూలు దారాలకు ఉండకపోవచ్చు. కానీ గాజు పెంకుల పొడి పూసిన దారాలకు ఉంటుందని ఢిల్లీలో రుజువైంది. పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి మెడకు చుట్టుకున్న దారం అతడి ప్రాణాలు బలిగొంది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని మౌజ్‌పురాకు చెందిన యోగేశ్ శర్మ ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అక్కడి సికందరాబాద్ నుంచి ఢిల్లీలోని తన ఇంటికి బైక్‌పై బయలుదేరారు. సరిగ్గా ఠాకూర్‌ద్వారా ఫ్లై ఓవర్ పైకి చేరుకోగానే అతని మెడకు ఓ గాలిపటం దారం చుట్టుకుంది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తూనే కొంతముందుకు వెళ్లారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అతని గొంతును, మెడ నరాలను ఆ దారం కోసేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న యోగేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ విక్రం కుమార్ శర్మ విచారణకు ఆదేశించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా మామూలు దేశవాళీ దారాలతో ఇటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారమే లేదని, కాటన్‌తో తయారయ్యే దారాలు కాస్త లాగితేనే తెగిపోతాయని గాలిపటాల తయారీదారులు చెబుతున్నారు. ఇటీవల భారత మార్కెట్లోకి ప్రవేశించిన చైనా దారాలతోనే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆ దారాలపై గాజు పెంకులను పొడిచేసి పూత పూస్తారని వారు పేర్కొన్నారు.