ఒక్కటైన విపక్షాలు!... జానా, కిషన్ రెడ్డిలకు రేవంత్ రెడ్డి ఫోన్!
కొత్త రాష్ట్రం తెలంగాణలో రాజకీయాలు కూడా సరికొత్త మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసిన అధికార పార్టీ టీఆర్ఎస్ టీ టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యను 15 నుంచి 3 కు తగ్గించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీపైనా అస్త్రాలు సంధిస్తున్న టీఆర్ఎస్ ఆ పార్టీలోని కీలక నేతలను లాగేసుకునే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో నేటి ఉదయం తెలంగాణ స్పీకర్ తీసుకున్న ఓ నిర్ణయం విపక్షాలన్నింటినీ ఒక్కటి చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలోని టీ టీడీఎల్పీకి కేటాయించిన రెండు గదులను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చెప్పా పెట్టకుండానే అసెంబ్లీ కమిటీలకు కేటాయించేశారు.
స్పీకర్ చర్యతో షాక్ తిన్న టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తక్షణమే రియాక్ట్ అయ్యారు. స్పీకర్ చర్యలను ఖండించిన ఆయన... తెలంగాణ సర్కారుపై పోరు సాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ జెండాలను పక్కనబెట్టిన ఆయన నేరుగా సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలకు ఫోన్ చేశారు. తెలంగాణ సర్కారు అవలంబిస్తున్న దమన నీతిపై పోరు సాగించేందుకు తమతో పాటు కలిసి రావాలని ఆయన వారిని కోరారు. వారు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.