భారత ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న పంతంజలి: ఏఎస్ సీఐ
రాందేవ్ బాబా నడుపుతున్న పతంజలి ఆయుర్వేద ప్రొడక్టుల వ్యాపార ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఏఎస్ సీఐ (అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఆరోపించింది. వ్యాపార రంగంలో ప్రత్యర్థుల ఉత్పత్తులను పతంజలి తక్కువ చేసి చూపుతోందని విమర్శించింది. తమ "కచ్చీ ఘనీ మస్టర్డ్ ఆయిల్" విషయంలో ప్రత్యర్థుల నూనెల్లో హెక్సేన్ ను కలిగివున్న ప్రమాదకర న్యూరోటాక్సిన్ లు ఉన్నాయని ఆరోపిస్తోందని, నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధమని తెలిపింది. పలు కంపెనీల నుంచి పతంజలిపై ఇప్పటివరకూ 67 ఫిర్యాదులు అందాయని తెలిపింది.
ఫ్రూట్ జ్యూస్ ల విషయంలోనూ తాము ప్రచారం చేసుకుంటున్నట్టుగా అందులో వాడిన దినుసుల విషయమై ఆరోపణలను నిరూపించుకోలేకపోయిందని వివరించింది. "ఖరీదైన శీతల పానీయాల్లో గుజ్జు (పల్ప్) తక్కువగా ఉంటుంది" అని, తన పానీయాల్లో గుజ్జు అధికమని చేసుకుంటున్న ప్రకటనలూ అవాస్తవాలేనని ఏఎస్ సీఐ పేర్కొంది. పంతంజలి 'దుగ్ధమృత్' విషయంలోనూ వాస్తవాలను దాచుతోందని, దంత కాంతి టూత్ పేస్తు ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించింది. ఇది వాడితే చిగుళ్ల రక్తం, దంతాల పసుపు పచ్చదనం, దుర్వాసన, సెన్సిటివిటీ పోతాయని చెబుతున్న పతంజలి సంస్థ అందుకు ఆధారాలు చూపలేకపోయిందని ఆరోపించింది. ఇక ఏఎస్ సీఐ ఆరోపణలపై పతంజలి ఆయుర్వేద ప్రతినిధిని వివరణ కోరగా, తాము వివరాలు పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో న్యాయ సలహాలు తీసుకుని ముందడుగేస్తామని వెల్లడించారు.