Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ హంతకుడిని అరెస్ట్ చేయనున్నామన్న విషయం పోలీసులకూ తెలియదు... మూడు నిమిషాల్లో ముగిసిన టెక్కీ 'స్వాతి' హంతకుడి అరెస్ట్!

ఇన్ఫోసిస్ ఉద్యోగిన స్వాతి హత్య కేసులో నిందితుడు పి.రామ్ కుమార్ ను కేవలం మూడంటే మూడు నిమిషాల ఆపరేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని అరెస్టు ప్లాన్ చాలా పకడ్బందీగానే సాగింది. తమిళనాడు పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, హైదరాబాద్ ఫోరెన్సిక్ నిపుణులు రామ్ కుమార్ హై రెజల్యూషన్ ఫోటోలను విడుదల చేసిన తరువాతనే అతని జాడ తెలిసింది. సెంగొట్టాయ్ సమీపంలోని మీనాక్షిపురం గ్రామంలో అతని చిరునామాను తెలుసుకుని ఆ సమాచారాన్ని తేన్ కాశి పోలీసులకు తెలిపారు. తిరునల్వేలి రేంజ్ డీఐజీ ఆర్.దినకరన్, ఎస్పీ వీ విక్రమన్ లు స్వయంగా ఈ ఆపరేషన్ నడిపించారు. తేన్ కాశీ పోలీస్ స్టేషన్లో మకాం వేసిన వీరు, నిందితుడు ఇంటికి వచ్చేంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అతని ఇల్లు గ్రామం మధ్యలోని అంబేద్కర్ కాలనీలో ఉండటంతో, భారీగా పోలీసులు వెళ్లవద్దని, మఫ్టీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపై పోలీసులను సంచరించవద్దని చెప్పి నిందితుడి రాకను తెలుసుకునేందుకు ఇద్దరిని మాత్రమే అక్కడ ఉంచారు. ఇక స్వాతి హత్యానంతరం రామ్ కుమార్ స్వగ్రామానికి వెళ్లి పొలాల్లో దాక్కుంటూ తిరిగాడు. పోలీసుల జాడ తెలియకపోవడంతో ఇంటికి వెళ్లి, అక్కడికి సమీపంలోని మరో చిన్న ఇంట్లో ఉన్నాడు. ఇక రాత్రి 10 గంటల సమయంలో పోలీసు ఆపరేషన్ ప్రారంభమైంది. సబ్ ఇనస్పెక్టర్ సహాయ సెల్విన్, కానిస్టేబుళ్లు కాలిముత్తు, షణ్ముగం, మహేష్ లు బయలుదేరారు. వీరెవరికీ రామ్ కుమార్ ను ఏ నేరంపై అరెస్ట్ చేయనున్నామన్న విషయం తెలియదు. ఓ కేసులో అతన్ని పట్టుకోవాలన్నది మాత్రమే వీరికి చెప్పారు. ఇక రామ్ కుమార్ ఇంటి చుట్టుపక్కలా కరెంటును తీసేసిన వీరు నెమ్మదిగా అక్కడికి వెళుతున్న క్రమంలో కుక్కలు విపరీతంగా మొరుగుతుంటే, కొందరు గ్రామస్థులు అడ్డుకోగా, తాము పోలీసులమని చెప్పారు. రామ్ కుమార్ ఇంటిముందు అతని తండ్రి పరమశివమ్ పడుకొని ఉండగా, లేపి కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని కోరిన వెంటనే, ఇంటి పక్కనే ఉన్న ప్రాంతాన్ని చూపాడు. తల్లి పుష్ప, ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లోనే నిద్రిస్తుండగా, పోలీసులు రామ్ ఉన్న చోటికి వెళ్లారు. అప్పటికే టీవీ చానళ్లు, పేపర్లలో ఫోటోలు ప్రచురితం కావడంతో తమ బిడ్డ అరెస్ట్ తప్పదని వారికి ముందే తెలుసు. ఇక పోలీసులను చూడగానే రామ్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అతన్ని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడిని అరెస్ట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వివరించారు.

More Telugu News