Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిగ్గుచేటు.. చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలకు స్పెల్లింగ్ చెప్పలేకపోతున్న యూపీ లెక్చరర్లు.. దర్యాప్తునకు బీజేపీ డిమాండ్

సాధారణ ఇంగ్లిష్ పదాలకు కూడా స్పెల్లింగ్ చెప్పలేకపోతున్న లెక్చరర్ల చేతిలో పడిన విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారుతోందని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ కళాశాలల్లోని లెక్చరర్లకు సాధారణ పదాలకు కూడా ఇంగ్లిష్ స్పెల్లింగ్ తెలియడం లేదని, జనరల్ నాలెడ్జ్ లేశమాత్రమైనా లేదని బీజేపీ ఆరోపించింది. ఇంగ్లిష్‌పై కనీస పట్టులేని లెక్చరర్లను ఎలా నియమించారో తేల్చేందుకు అత్యున్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని గవర్నర్ రామ్ నాయక్‌ను కోరింది. ‘‘చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు కూడా చిన్న ఇంగ్లిష్ పదాలకు స్పెల్లింగ్ చెప్పేందుకు ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి జనరల్ నాలెడ్జ్ లేదు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు వీరి చేతిలో నలిగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతున్నాం’’ అని గవర్నర్‌ను పేర్కొంది. లెక్చరర్లుగా ఏమాత్రం అర్హత లేని వారిని ఎలా నియమించారో తేల్చాలని కోరింది. దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జాతీయ సెక్రటరీ శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు.

More Telugu News